: తొలి టీ20లో బోల్తా పడ్డ టీమిండియా... లంక చేతిలో 5 వికెట్ల తేడాతో చిత్తు


ఆస్ట్రేలియా పర్యటనలో అత్యంత పటిష్టమైన ఆ దేశ జట్టును పొట్టి ఫార్మాట్ లో వైట్ వాష్ చేసిన ధోనీ సేన, కుర్రాళ్లతో కూడిన శ్రీలంక జట్టుపై మాత్రం జోరు కొనసాగించలేకపోయింది. నిన్న హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా ఏకంగా ఐదు వికెట్ల తేడాతో చిత్తు అయ్యింది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నిన్న పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో టీమిండియాను లంక కుర్రాళ్లు ఐదు వికెట్ల తేడాతో ఓడించారు. టాస్ గెలిచిన లంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ బౌలింగ్ ను ఎంచుకుని ఆతిథ్య దేశ జట్టును ఫస్ట్ బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. తొలి ఓవర్ లోనే లంక కొత్త కుర్రాడు రజిత తన పదునైన బంతులతో నిప్పులు చెరిగాడు. వేసిన రెండో బంతికే టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మను డకౌట్ చేశాడు. ఆ తర్వాత అదే ఓవర్ చివరి బంతికి అజింక్యా రెహానే (4)ను కూడా పెవిలియన్ చేర్చాడు. తొలి ఓవర్ తోనే వికెట్ల పతనం మొదలైన టీమిండియా ఆ తర్వాత కోలుకోలేదు. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్ మన్ వచ్చినట్టే వచ్చి వెనువెంటనే పెవిలియన్ చేరడం ప్రారంభించారు. ఈ క్రమంలో 18.5 ఓవర్లలోనే ధోనీ సేన 101 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత 102 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లంక జట్టు 18 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసి, ఐదు వికెట్ల తేడాతో జయ కేతనం ఎగురవేసింది. వెరసి మూడు టీ20ల సిరీస్ లో ఆ జట్టు 1-0 ఆధిక్యాన్ని సాధించింది.

  • Loading...

More Telugu News