: యువ బౌలర్లు భారత జట్టును బెదరగొట్టారు...టీమిండియా 101 ఆలౌట్
టీమిండియా బ్యాట్స్ మన్ ను శ్రీలంక యువ బౌలర్లు బెదరగొట్టారు. ఈ మధ్య కాలంలో ప్రపంచంలోని ఏ జట్టూ టీమిండియాను అవుట్ చేయనంత తక్కువ స్కోరుకు శ్రీలంక యువ బౌలర్లు ఆలౌట్ చేయడం విశేషం. శ్రీలంక బౌలర్లు సంధించిన బంతుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాట్స్ మన్ ను ముప్పుతిప్పలు పెట్టారు. అనూహ్యమైన బౌన్స్ తో బంతి ఎగసిపడుతుంటే భారత బ్యాట్స్ మన్ వద్ద సమాధానం లేకపోవడం విశేషం. భారత జట్టు పరుగులేమీ చేయకుండానే వికెట్ల ఖాతా తెరిచిందంటే లంకేయులు ఏ విధంగా బౌలింగ్ చేశారో అంచనా వేయవచ్చు. టీమిండియా బ్యాట్స్ మన్ లో అశ్విన్ చేసిన 31 పరుగులు అత్యుత్తమం కాగా, రైనా, యువరాజ్ రెండంకెల స్కోరు చేయడం గొప్ప. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే రోహిత్ శర్మ (0) పెవిలియన్ చేరాడు. అక్కడి నుంచి వరుసగా వికెట్ల పతనం ప్రారంభమైంది. రహానే (4), శిఖర్ ధావన్ (9) ను రజిత పెవిలియన్ బాటపట్టించాడు. అనంతరం అద్భుతమైన బంతితో రైనా (20) ను శనక బౌల్డ్ చేశాడు. మరో అద్భుతమైన బంతితో ధోనీ (2) ని బోల్తా కొట్టించాడు. ఈ దశలో క్రీజులో కుదురుకున్నాడని భావించిన యువరాజ్ (10) అనవసర షాట్ కు యత్నించి అవుటయ్యాడు. అనంతరం వచ్చిన హార్డిక్ పాండ్య (2) బంతిని అంచనా వేయడంలో పొరబడి ఎల్బిడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన రవీంద్ర జడేజా (6) కూడా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో బరిలో దిగిన అశ్విన్ మొక్కవోని పట్టుదలతో 24 బంతుల్లో ఐదు ఫోర్లతో 31 పరుగులు చేశాడు. అతనికి నెహ్రా (9) సహకారమందించడంతో లంక బౌలర్లను అడ్డుకున్నాడు. అనంతరం బుమ్రా (0) వస్తూనే రన్ అవుట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ 18.5 ఓవర్లకు ముగిసింది. 101 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. శ్రీలంక ఆటగాళ్లలో రజిత, శనక చెరి మూడు వికెట్లతో రాణించగా, చమీర రెండు, సేనానాయకే ఒక వికెట్ తో ఆకట్టుకున్నారు. 102 పరుగుల విజయ లక్ష్యంతో శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించనుంది.