: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై జోరుగా చర్చ... వచ్చే ఎన్నికల నాటికి పెరగడం ఖాయమన్న సుజనా
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యపై చర్చ ప్రస్తుతం అప్రస్తుతమనే చెప్పాలి. ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయముంది. అంతేకాక కొత్త రాష్ట్రం తెలంగాణలో ఇంకా వ్వవస్థీకృత పాలన పట్టాలెక్కలేదు. ఇక హైదరాబాదు ఆదాయాన్ని కోల్పోయిన ఏపీ పూర్తిగా ఆర్థిక లోటులో చిక్కుకుంది. ఇరు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆర్థిక పరిస్థితులేమీ అంత ఆశాజనకంగా లేవు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఉద్యోగులకు కూడా వేతనాలు ఇవ్వలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై జోరుగా చర్చ జరుగుతుండటం జనాన్ని విస్మయానికి గురి చేస్తోంది. నిన్నటికి నిన్న ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ చర్చకు తెర తీశారు. ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని తాను రాసిన లేఖకు కేంద్రం స్పందించిందని ఆయన తెలిపారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచే ఉద్దేశం తమకు లేదని కేంద్రం తేల్చిచెప్పిందని ఆయన పేర్కొన్నారు. తాజాగా నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రులతో భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన వెంట పలువురు కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లిన టీడీపీ సీనియర్ నేత, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి... అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య తప్పకుండా పెరుగుతుందని కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ మేరకు తమకు కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయని కూడా ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలోనే కాక తెలంగాణలోనూ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతందని సుజనా చెప్పారు.