: వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలోనూ ‘గ్రేటర్’ వ్యూహమే!... మార్చి ఫస్ట్ వీక్ లో ఎన్నికలు
కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కొత్త రాష్ట్రంలో తొలిసారి జరిగిన గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. గ్రేటర్ చరిత్రలో అత్యధిక స్థానాలను గెలుచుకున్న పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. గ్రేటర్ లో టీఆర్ఎస్ విజయానికి పలు కారణాలున్నాయని విశ్లేషణలు సాగుతున్నా... వాటిలో ప్రధానమైనది ఎన్నికల షెడ్యూల్ కుదింపే. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ 26 రోజులుగా ఉంటుంది. దీనిని 15 రోజులకు కుదించేసి ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధించింది. ఈ వ్యూహంపై పలు వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తినా, ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఎన్నికల షెడ్యూల్ కుదింపు కారణంగా తమకు ఎన్ని రోజులు ప్రచారానికి వీలుంటుందో, మిగిలిన అన్ని పార్టీలకు కూడా అంతే సమయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసిన ప్రభుత్వం తనకున్న అతి తక్కువ కాలాన్ని బాగానే సద్వినియోగం చేసుకుంది. ఘన విజయాన్ని సాధించింది. ఇక తెలంగాణలోని వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గ్రేటర్ లో అవలంబించిన వ్యూహం... తమకు మంచి ఫలితాలను సాధించిపెట్టిన నేపథ్యంలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలోనూ అదే వ్యూహంతో బరిలోకి దిగాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే నెల (మార్చి) తొలి వారంలోనే ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని వార్తలు వినిపిస్తున్నాయి. నేటి రాత్రిలోగా ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలున్నాయి.