: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం యోచన... ఢిల్లీ ఎమ్మెల్యేల వేతనాలపై చర్చ
కొత్త రాష్ట్రం తెలంగాణలో స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులకు భారీగా వేతనాలు పెరిగాయి. జిల్లా పరిషత్ చైర్మన్, నగర మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, ఎంపీపీలు... తదితరుల వేతనాలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. ఈ చర్యతో తెలంగాణ సీఎం కేసీఆర్... స్థానిక సంస్థలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం జడ్పీ చైర్మన్లు నెలకు లక్ష రూపాయల వేతనాన్ని పొందుతున్నారు. ఇకపై వీరి వేతనం మరోమారు భారీగా పెరగనుంది. ఈ బంపరాఫర్ కథా కమామీషు ఏంటంటే... తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రస్తుతం నెలకు రూ.95 వేల దాకా అందుతోంది. అయితే ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం తన ఎమ్మెల్యేల వేతనాలను అమాంతంగా పెంచేసింది. దీంతో వారి వేతనం నెలకు రూ.4 లక్షలకు చేరింది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఉంటున్న ఎమ్మెల్యేల వేతనం ఆ మాత్రం ఉంటేనే భాగుంటుందన్న భావన వ్యక్తమైంది. ఈ క్రమంలో నేడు హైదరాబాదులో జరిగిన ఓ భేటీ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంలోని కీలక మంత్రుల మధ్య ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హాజరైన మంత్రులంతా వేతనాల పెంపుకే మొగ్గుచూపారు. పెరిగిన జీవన వ్యయం నేపథ్యంలో ప్రజా ప్రతినిధుల వేతనాల పెంపు తప్పేమీ కాదన్న రీతిలో కేసీఆర్ కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఢిల్లీ ఎమ్మెల్యేల వేతనాల పెంపుపై సుదీర్ఘ చర్చ జరిగింది. అంతేకాక దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు ఎలా ఉన్నాయన్న అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఎంతమేర వేతనాలు పెంచితే బాగుంటుందన్న విషయంపై ఓ స్పష్టత రాకున్నా, వేతనాల పెంపుకు మాత్రం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పనిలో పనిగా రాష్ట్రంలో కేబినెట్ ర్యాంకులో ఉన్న ఇతర ప్రజా ప్రతినిధులకు కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వనున్న కొత్త వేతనాలను అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కేబినెట్ ర్యాంకు ఉన్న ప్రజా ప్రతినిధుల విషయానికి వస్తే... రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా కేబినెట్ ర్యాంకు హోదాలోనే ఉంటారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు పెరిగితే జిల్లా పరిషత్ చైర్మన్ల వేతనాలు కూడా అమాంతంగా పెరగడం ఖాయంగానే కనిపిస్తోంది.