: అంతిమ సంస్కారాలకు సిద్ధం చేస్తుండగా బతికిన శిశువు!
చనిపోయిన శిశువుకు అంతిమ సంస్కారాలు చేసేందుకు సిద్ధపడుతుండగా ప్రాణాలతో కదలాడిన ఆశ్చర్యకరమైన సంఘటన చైనాలో జరిగింది. గత జనవరిలో నెలలు నిండని మగబిడ్డ జిజియాంగ్ ప్రావిన్స్ లోని పానన్ ఆసుపత్రిలో జన్మించింది. ఆ శిశువును సుమారు 23 రోజుల పాటు ఇంక్యుబేటర్ లో ఉంచారు. లునార్ న్యూఇయర్ ప్రారంభమైన రోజున (సోమవారం) తల్లిదండ్రులు తమ బిడ్డను ఇంటికి తీసుకువెళ్లారు. అయితే, కొన్ని రోజుల తర్వాత శిశువు అనారోగ్యం పాలవడంతో మళ్లీ ఆసుపత్రికే తీసుకువెళ్లారు. శిశువును పరీక్షించిన వైద్యులు ఆ బిడ్డ చనిపోయిందని చెప్పారు. శిశువు గుండె కొట్టుకోవడం లేదని వైద్యులు చెప్పడంతో తండ్రి ఆవేదన చెందాడు. అనంతరం ఆ శిశువును ఒక గదిలో భద్రపరిచారు. సుమారు -12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ఆ గదిలో సుమారు 15 గంటలపాటు ఆ శిశువును ఉంచారు. అనంతరం, అంతిమ సంస్కారాల నిమిత్తం జిజాంగ్ ప్రావిన్స్ లోని పానన్ కు శిశువును తరలించారు. ఇక దహనం చేసేందుకు సిద్ధమవుతుండగా శిశువు మూలగడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. పరీక్షించి చూడగా, శిశువు బతికుండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, శిశువు చనిపోయిందని డాక్టర్లు చెప్పిన తర్వాత, తండ్రి ఆ శిశువును ఒక మందమైన కవర్ లో పెట్టి దానిపై రెండు టవల్స్ లాంటివి చుట్టాడు. అనంతరం అతి శీతలగదిలో శిశువును భద్రపరిచినప్పటికీ ఎటువంటి హాని కలగకపోవడానికి కారణం తండ్రి తీసుకున్న ఆ జాగ్రత్తలేనని వైద్యులు చెబుతున్నారు.