: చెంపదెబ్బ కేసులో రూ.5 లక్షలు ఇచ్చి..సారీ చెబుతానంటున్న గోవిందా!
ఒక వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన కేసులో బేషరతుగా క్షమాపణలు చెప్పేందుకు బాలీవుడ్ నటుడు గోవిందా సిద్ధపడ్డారు. కేవలం క్షమాపణలు చెప్పడమే కాకుండా చెంపదెబ్బ బాధితుడికి రూ.5 లక్షలు కూడా ఇచ్చేందుకు గోవిందా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఎనిమిదేళ్ల క్రితం గోవిందా హీరోగా నటిస్తున్న 'మనీ హైతో మనీ హై' చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఉత్తర ముంబయి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా గోవిందా ఉన్నాడు. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూ నియోజకవర్గ సమస్యలను గాలికి వదిలేశారన్న సంతోష్ రాయ్ అనే వ్యక్తి వ్యాఖ్యలకు ఆగ్రహించిన గోవిందా అతని చెంప ఛెళ్లుమనిపించాడు. దీంతో, గోవిందా తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సంతోష్ రాయ్ బాంబే హైకోర్టులో 2013లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఈ సంఘటన జరిగిన ఏడాది తర్వాత కేసు నమోదు చేశాడన్న కారణంతో 2013లో హైకోర్టు ఈ కేసును కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తాను రూ. ఐదారు లక్షలు ఖర్చు చేశానంటూ సంతోష్ రాయ్ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. బాధితుడికి ‘సారీ’ చెప్పాలంటూ గతంలో కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.