: 46 రోజుల పాటు ఇండియాలోనే ప్రధాని నరేంద్ర మోదీ... ఆ రికార్డు బద్దలయ్యేనా?
నరేంద్ర మోదీ ఇండియాలో 46 రోజుల పాటు ఉన్నారు. మన ప్రధాని మన దేశంలో ఉండక మరెక్కడుంటారు, అంటారా? నిజమే మరి...ఎప్పుడూ విదేశాల్లో విహరించే మన ప్రధాని ఇప్పుడు ఇండియాలో ఇన్ని రోజులు ఏకబిగిన ఉండడం ఇదో రికార్డే! పైగా, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత విదేశాలకు ప్రయాణించకుండా ఇండియాలో అత్యధిక రోజులు గడిపిన రెండో రికార్డు ఇది. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 20 నెలలు గడుస్తుండగా, ఈ సంవత్సరం మాత్రం ఇంతవరకూ ఏ విదేశానికీ వెళ్లలేదు. డిసెంబర్ 23 నుంచి 25 మధ్య రష్యా, ఆఫ్గనిస్తాన్, పాకిస్థాన్ దేశాల్లో ఆయన పర్యటించి వచ్చారు. ఆపై మరే దేశానికీ వెళ్లలేదు. 2014లో నవంబర్ 26 తరువాత 2015 మార్చి 9వ తేదీ వరకూ ఆయన ఇండియాలో 72 రోజులు గడిపారు. ఆపై ఎక్కువ రోజులు ఇక్కడే ఉండటం ఇదే తొలిసారి. కాగా, ఈ సంవత్సరం మార్చి 31వ తేదీన అమెరికాలో జరిగే జాతీయ అణు సదస్సుకు హాజరు కానున్నారు. ఈ ప్రయాణానికి మరో 40 రోజులకు పైగా సమయం ఉండటంతో, మరో దేశానికి ప్రయాణించకపోతే, ఆయన ఎక్కువలో ఎక్కువ 82 రోజుల పాటు ఏ దేశానికీ వెళ్లకుండా ఉన్నట్లవుతుంది. కాగా, ఈలోగా సాధ్యమైనంత వరకూ దేశ రాజకీయాలపై, బీజేపీని బలపరిచే దిశగా దృష్టిని సారించాలని, ముఖ్యంగా బడ్జెట్, కీలక బిల్లుల ఆమోదం తదితరాంశాలపై మనసు పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం మార్చిలోగా యూపీ, పంజాబ్, తమిళనాడు సహా 8 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పొత్తులు, గెలుపుపై కసరత్తులు చేస్తారని తెలుస్తోంది. ఇదిలావుండగా, ఈ సంవత్సరం పెద్దగా విదేశీ పర్యటనలు పెట్టుకోబోనని మోదీ ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖకు, ఓఎఫ్ బీజేపీ (ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ)కి స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 2014లో మోదీ 7 నెలల వ్యవధిలో 9 దేశాలను సందర్శించారు. మొత్తం మీద ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 28 దేశాలు చుట్టొచ్చారు. 2015లో 54 రోజుల పాటు ఆయన విదేశాల్లోనే ఉన్నారు.