: కాల్పుల కేసు నిందితుడు డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య!
డాక్టర్ ఉదయ్ కుమార్ పై కాల్పుల కేసుల నిందితుడిగా భావిస్తున్న వైద్యుడు శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల ఘటన అనంతరం శశికుమార్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కలపల్లిలోని ఫామ్ హౌజ్ లో అతని మృతదేహాన్ని గుర్తించారు. శశికుమార్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఉదయ్ కుమార్ పై కాల్పుల ఘటన అనంతరం నిన్న సాయంత్రం ఆరున్నర గంటలకు శశికుమార్ ఫాంహౌజ్ కు వెళ్లాడు. రాత్రి 9.30 గంటల సమయంలో సూసైడ్ నోట్ రాసి శశికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు, స్నేహితులు తనను మోసం చేశారని, చనిపోతున్నానంటూ శశికుమార్ తన భార్య క్రాంతికి ఫోన్ చేశాడు. నారాయణ గూడ, మొయినాబాద్ పోలీసుల సహకారంతో పంజాగుట్ట పోలీసులు ఫాంహౌజ్ కు చేరుకునే సరికే శశికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ నోట్ లో ఏమి రాశాడంటే... కాల్పుల ఘటనలో తన ప్రమేయం లేదని, గాయపడ్డ వైద్యుడు ఉదయ్ కుమార్ చనిపోతాడనే భయంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాశాడు. ఆసుపత్రి నిర్వహణ విషయంలో తనను మోసగించారని, వైద్యులు సాయికుమార్, ఉదయ్ కుమార్ వేధింపుల వల్లే తాను చనిపోతున్నానని సూసైడ్ నోట్ లో శశికుమార్ పేర్కొన్నాడు.