: "మా ఆదాయం తగ్గుతుంది" అని కాగ్నిజంట్ చెబితే, కుదేలైన టీసీఎస్, ఇన్ఫోసిస్!
న్యూజర్సీ కేంద్రంగా పనిచేస్తూ, శరవేగంగా విస్తరిస్తున్న ఐటీ సేవల సంస్థ కాగ్నిజంట్ డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తూ, భవిష్యత్తులో ఆదాయ అంచనాలను కుదించిన వేళ, మిగతా ఐటీ కంపెనీలపై పెను ప్రభావం పడింది. నేటి స్టాక్ మార్కెట్లో ఐటీ ఇండెక్స్ అత్యధికంగా నష్టపోగా, టీసీఎస్, ఇన్ఫోసిస్ సంస్థల వాటా విలువ మూడు శాతానికి పైగా పడిపోయింది. కాగా, మార్చితో ముగిసే మూడు నెలల కాలానికి 3.18 బిలియన్ డాలర్ల నుంచి 3.24 బిలియన్ డాలర్ల మధ్య తమ ఆదాయం ఉండవచ్చని ఆ సంస్థ తెలిపింది. కాగ్నిజంట్ వృద్ధికి సంబంధించినంత వరకూ, మార్చి 2002 తరువాత అంటే దాదాపు 14 ఏళ్ల తరువాత ఇదే అత్యల్పం. 2016 క్యాలెండర్ సంవత్సరంలో 10 నుంచి 14 శాతం మేరకు ఆదాయం పెరగవచ్చని భావిస్తున్నట్టు వెల్లడించింది. కాగ్నిజంట్ 2015లో 21 శాతం వృద్ధిని సాధించి, మిగతా అన్ని ఐటీ కంపెనీలతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాగ్నిజంట్ భవిష్యత్ ఆదాయ అంచనా, ఐటీ ఇండస్ట్రీపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించి వేసిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, ఈ ఉదయం 12:30 గంటల సమయంలో టీసీఎస్ 4 శాతం, ఇన్ఫోసిస్ 3.6 శాతం, విప్రో 1.9 శాతం, టెక్ మహీంద్రా 4.1 శాతం, హెచ్సీఎల్ 3.59, టాటా ఎక్సెల్ 3.44 నష్టంలో సాగుతున్నాయి. బీఎస్ఈ టెక్ ఇండెక్స్ 3 శాతం నష్టంలో కొనసాగుతోంది.