: రైలెక్కితే ఇక ఏమి'టీ' రుచి అనాల్సిందే!... 25 రకాల టీలు పలకరిస్తాయ్!
ఉదయం లేవగానే వేడివేడిగా కప్పుడు టీ లోపల పడితే ఎంతో ఉత్సాహం వస్తుంది. పని ఒత్తిడిలో ఉన్నా కూడా అంతే. ఇక ప్రయాణాల్లో ఉంటే, అందునా రైళ్లలో ఉంటే... కనీసం రెండు మూడు గంటలకోసారన్నా టీ తాగాలని అనిపిస్తుంది. కానీ, బయట టీలు నీళ్లగా ఉంటాయని, రుచిగా ఉండవని చాలా మంది టీ తాగాలన్న కోరికను బలవంతంగా అణచుకుంటారు. ఇక రైల్వేల్లో సంస్కరణల్లో భాగంగా ఐఆర్సీటీసీ సరికొత్త ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. దేశంలోని 12 వేల రైలు మార్గాల్లో 25 రకాల టీలను అందిస్తామని ప్రకటించింది. వీటిని ప్రయాణంలోనే ఆర్డర్ చేసేందుకు ఓ మొబైల్ యాప్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. 'చాయోస్' అనే టీ కేఫ్ చైన్ తమకు సహకరిస్తుందని ఐఆర్సీటీసీ చైర్మన్ అరుణ్ కుమార్ మనోచా వెల్లడించారు. ఇందులో దేశవాళీ చాయ్ నుంచి ఆమ్ పాపడ్, హరీ మిర్చి, కుల్హడ్, అద్రక్ తులసీ, హనీ, లెమన్, జింజర్... ఇలా పలు వెరైటీలను అందిస్తామని తెలిపారు. ఇక రూ. 300కు పైగా విలువైన టీలను ఆర్డరిస్తే, 10 శాతం క్యాష్ బ్యాక్ ఉంటుందని పేర్కొన్నారు.