: కేసీఆర్, మోదీది ఏ కులం? మంద కృష్ణ ఏమయ్యాడు? కృష్ణయ్యతో నష్టపోయాం: చంద్రబాబు
కుల రాజకీయాలు కూడు పెట్టవని, కులాల పేర్లు చెప్పి ఓట్లు రాబట్టుకోవాలంటే అది కుదిరేపని కాదని ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో ధనికులు, పేదలన్న రెండు కులాలే ఉన్నాయన్న ఆయన, తెలంగాణలో కేసీఆర్ ది, కేంద్రంలో మోదీది ఏ కులమని, వారి కులాలు చూసే ప్రజలు ఓట్లేశారా? అని ప్రశ్నించారు. గతంలో కులాల పేరు చెప్పి ఓట్లడిగిన మంద కృష్ణకు ఎన్ని ఓట్లు వచ్చాయని ప్రశ్నించారు. బెంగాల్ లో మమతా బెనర్జీ, ఒడిసాలో నవీన్ పట్నాయక్ వంటి వారెందరో కులాల రాజకీయాలకు అతీతంగా ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. తెలంగాణలోని ఎల్బీ నగర్ లో ఆర్ కృష్ణయ్యను పోటీలో దింపడం వల్లే తమకు మెజారిటీ తగ్గిందని సొంత పార్టీ ఎమ్మెల్యేపైనా రుసరుసలాడారు. ముద్రగడ దీక్ష విరమణ తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన, ఎవరు ఎక్కడ పుట్టాలన్నది మానవుల చేతుల్లో ఉండదని వేదాంతం చెప్పారు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పుడితే పుష్కలంగా నీరుంటుంది. సీమలో పుడితే నీరు దొరకదు. ఎవరి చేతుల్లోనూ లేని కులం, ప్రాంతాలతో రాజకీయాలు చేయడం సరికాదని వైకాపాను ఉద్దేశించి హితవు పలికారు. మీడియా సైతం తనను విమర్శిస్తే ప్రాధాన్యం ఇస్తోందని, బ్రహ్మాండంగా జరిగిన విశాఖ ఫ్లీట్ రివ్యూకు సరైన కవరేజ్ రాలేదని అసహనాన్ని వ్యక్తం చేశారు.