: నన్ను జైలుకు పంపడానికి నా సోదరి 28 కేజీల బరువు తగ్గించింది!: రణదీప్ హుడా
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యాడు. ఎందుకంటే, పాకిస్థాన్ జైల్లో దశాబ్దాలుగా మగ్గిన సరబ్ జీత్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో రణదీప్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. దీంతో దర్శకుడు బరువు తగ్గాలని సూచించాడు. అంతే, మరేదీ ఆలోచించని రణదీప్ కేవలం నెల వ్యవధిలో 28 కేజీల బరువు తగ్గాడు. ఈ కొత్త అవతారంలో తీయించుకున్న ఫోటోను తను సోషల్ మీడియాలో పెట్టడంతో 'ఎవరీ పిచ్చోడు?' అంటూ అంతా ఆరాతీశారు. తర్వాత 'అతను రణదీప్ హుడా' అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. దీంతో అసలు విషయం రణదీప్ హుడా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 'సరబ్ జీత్ ను బయటికి తీసుకొచ్చేందుకు అతని సోదరి అలుపెరగని పోరాటం చేస్తే, నా సోదరి మాత్రం నన్ను జైలుకి పంపించేందుకు 28 కేజీలు బరువు తగ్గించింద'ని సరదాగా ట్వీట్ చేశాడు. రణదీప్ హుడా సోదరి డైటీషియన్ కావడంతో వైద్యులు వారిస్తున్నప్పటికీ అతను భారీ స్థాయిలో బరువు తగ్గించుకునేందుకు సహకరించింది. అయితే, తాను ఈ విధంగా చేశానని ఎవరూ ఇలా ప్రయత్నించవద్దని రణదీప్ సలహా ఇచ్చాడు. ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించాడు. బాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలతో అలరించే రణదీప్ హుడాను అభిమానులు బాగా అనుసరిస్తారు. కాగా, ఈ సినిమా మార్చిలో విడుదల కానుంది. దీనికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.