: మనం ఏ కులంలో పుట్టాలో మనం నిర్ణయించలేం... అది దైవ నిర్ణయం!: చంద్రబాబు


కులాలు, మతాలను రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, 208 రోజులపాటు పాదయాత్ర చేసిన వాడినని, ప్రజల కష్టనష్టాలు చూసిన వ్యక్తినని అన్నారు. తన జీవితంలో ఆ పాదయాత్ర పెను మార్పు తీసుకువచ్చిందని ఆయన అన్నారు. అందుకే తన బాధ్యత తనకు గుర్తు చేయనవసరం లేదని ఆయన అన్నారు. తానెప్పుడూ బాధ్యతల నుంచి వైదొలగే వ్యక్తిని కాదని ఆయన చెప్పారు. కాపుల్లో నిరుపేదలకు న్యాయం జరగాల్సి ఉందని ఆయన తెలిపారు. కాపులను ఆదుకునే విషయంలో ఎలాంటి రాజీ లేదని ఆయన చెప్పారు. సున్నితమైన సమస్యను జటిలం చేయవద్దని ఆయన సూచించారు. గతంలో చెప్పిన వారు ఏదీ చేయలేదని, తామేదో చేస్తున్నప్పుడు విద్వేషాలు రేపుతున్నారని ఆయన వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన అడిగారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న ఎవర్నీ వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఏ కులంలోనూ ఎవరూ కావాలని పుట్టరని, దానిని మనం నిర్ణయించుకోలేమని, అది దైవ నిర్ణయమని ఆయన చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం కుల విద్వేషాలు రేపడం సమంజసం కాదని ఆయన తెలిపారు. మత విశ్వాసాలు కూడా ఎవరికి ఏది సముచితమనిపిస్తే దానిని ఆచరిస్తారని, వాటిని రాజకీయాలకు వినియోగించడం శోచనీయమని ఆయన అభిప్రాయపడ్డారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలుగా ప్రజలు విడిపోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News