: అల్ ఖైదా, తాలిబాన్, ఐఎస్ఐఎస్... ఉగ్రవాదులు ఎవరైనా పాక్ ఐఎస్ఐ చేతుల్లోనే!: న్యూయార్క్ టైమ్స్
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల సంఖ్య పెరగడంతో పాటు, చాలా దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించడానికి ప్రధాన కారణం పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ కారణమని 'న్యూయార్క్ టైమ్స్' దినపత్రిక నేటి తన ప్రత్యేక వ్యాసంలో ఆరోపించింది. ఈ దిశగా నిపుణులు ఎన్నో సాక్ష్యాలను వెలుగులోకి తెచ్చారని వెల్లడించింది. "ఈ సమస్య కేవలం ఆఫ్గనిస్థాన్ కు మాత్రమే పరిమితం కాదు, చాలా దేశాల్లో ఉగ్రవాదుల సంఖ్య విస్తరించేందుకు ఐఎస్ఐ సాయపడింది" అని పేర్కొంది. అంతర్జాతీయ ముజాహిద్దీన్ దళాలను, ముఖ్యంగా సున్నీ తీవ్రవాదాన్ని పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ పెంచి పోషిస్తోందని, ఇస్లామిక్ స్టేట్ విస్తరణలోనూ భాగముందన్న అనుమానాలున్నాయని తెలిపింది. అల్ ఖైదా, తాలిబాన్ వర్గాలకు ఆశ్రయమివ్వడం లేదని ఆ దేశం చెబుతున్నప్పటికీ, అది అవాస్తవమేనని పేర్కొంది. ఉగ్రవాదుల చర్యలకు పాక్ సైతం కొన్నిసార్లు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని గుర్తు చేసింది. ఆఫ్గన్ తో ఇండియా స్నేహం చేస్తుండటం పాక్ కు ఇష్టం లేదని ఈ వ్యాసంలో పత్రిక నార్త్ ఆఫ్రికా ప్రతినిధి కార్లొట్టా గాల్ ఆరోపించారు. పాక్ లో హఖ్ఖానీ నెట్ వర్క్ నేత సిరాజుద్దీన్ హఖ్ఖానీ స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, ఆయన రావల్పిండిలోని పాక్ ఇంటెలిజన్స్ హెడ్ క్వార్టర్స్ కు సైతం వెళ్లి వస్తుంటాడని ఆయన ఆరోపించారు. తాలిబాన్ల కొత్త నేత ముల్లా అఖ్తర్ ముహమ్మద్ మన్సూర్ సైతం పాక్ నగరం క్వెట్టాలో బహిరంగంగా సమావేశాలు నిర్వహిస్తున్నాడని వివరించారు. అల్ ఖైదా లీడర్ అయ్ మన్ అల్ - జవహరీకి పాక్ సకల సౌకర్యాలనూ అందిస్తోందని, దక్షిణ ఆఫ్గనిస్థాన్ లో ఆయన విస్తరించేందుకు ఐఎస్ఐ నిధులందిస్తోందని తెలిపారు.