: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చిక్కితే అత్యంత కిరాతకమైన 'వాటర్ బోర్డింగ్' ఇంటరాగేషనే: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీ పడతారని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ స్టేట్ నుంచి ఉపద్రవాలను అరికట్టాలంటే వివాదాస్పద ఇంటరాగేషన్ పద్ధతి 'వాటర్ బోర్డింగ్' వాడాల్సిందేనని ఏబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మధ్య ప్రాచ్య దేశాల్లో క్రిస్టియన్ల తలలను తెగనరుకుతున్నారని గుర్తు చేసిన ఆయన, పట్టుబడే ఉగ్రవాదులపై అత్యంత కిరాతకమైన విచారణ పద్ధతిగా భావించే వాటర్ బోర్డింగ్ వాడాలని అన్నారు. "మనమిప్పుడు మధ్యయుగంలో నివసిస్తున్నట్టుంది. నా వరకూ నేను వాటర్ బోర్డింగ్ ను తిరిగి అమలు చేయాలనే కోరుతాను. అంతకన్నా కఠిన పద్ధతులు ఉంటే వాటినీ తిరిగి తీసుకురావాలన్నదే నా అభిమతం" అని అన్నారు. కాగా, వాటర్ బోర్డింగ్ అంటే దారుణమైన హింస. ఈ విధానంలో విచారణ ఎదుర్కొనే వారు ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతారు. తట్టుకుని నిలిస్తే పిచ్చివారైపోతారు. ఈ పద్ధతిలో వ్యక్తిని ఏటవాలుగా ఉన్న బల్లపై తల కిందకు వచ్చేట్టు పడుకోబెట్టి కాళ్లూ చేతులూ కట్టేసి ముఖానికి ముసుగు తొడుగుతారు. ఆపై ముఖంపై ధారగా నీరు పోస్తారు. విచారణ ఎదుర్కొనే వ్యక్తి ఊపిరి పీల్చుకోలేకపోతాడు. ముక్కుల్లో నుంచి నీరు ఊపిరితిత్తుల్లోకి, మెదడు లోకి చేరిపోతుంది. ఈ ఇంటరాగేషన్ పద్ధతిని గతంలో గ్వాంటనామా బేలో అమలు చేసినట్టు తెలుస్తోంది. ఆపై దీన్ని నిషేధించినప్పటికీ, ఇరాక్, ఆఫ్గన్ యుద్ధంలో పట్టుబడ్డ కొందరు ఉగ్రవాదులపై ప్రయోగించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇదిలావుండగా, టెక్సాస్ సెనెటర్, రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న టెడ్ క్రూజ్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. కొన్ని పరిధుల వరకూ మాత్రమే ఇంటరాగేషన్ కు తాను అనుకూలమని, ఈ తరహా భయంకర హింసకు ఎవరినీ గురిచేయరాదని అన్నారు.