: వరంగల్ జిల్లా తండాలో దారుణం... మహిళను వివస్త్రను చేసి ఊరేగించారు!
కర్ణాటక రాజధాని బెంగళూరులో టాంజానియా యువతిపై దాడి చేసి వివస్త్రను చేసిన ఘటన మరచిపోకముందే తెలంగాణలోని వరంగల్ జిల్లాలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. జిల్లాలోని వర్ధన్నపేట మండలం డీసీ తండాలో ఓ మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి రవి అనే వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారు. భార్యల మధ్య వివాదం రేగడంతో, రెండో భార్య అనితను మొదటి భార్య బంధువులు చిత్ర హింసలకు గురిచేసి అమానుషంగా ప్రవర్తించారు. ఆమె ఒంటిపై మండుతున్న ఇనుప చువ్వలతో కాల్చారు. అంతటితో ఆగకుండా వివస్త్రను చేసి తండాలో ఊరేగించారు. ఈ సంఘటన తెలిసిన కొంతమంది స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చి బాధితురాలు అనితను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.