: మానవ చరిత్రలో మొదటిసారి... ఓ మనిషి ప్రాణం తీసిన ఉల్క!


ఆకాశం నుంచి పడే ఉల్కలు, భూ వాతావరణంలోకి రాగానే మండిపోతాయని అందరికీ తెలిసిందే. ఆ ఉల్కలు భూమిని తాకడం అత్యంత అరుదు. ఒకవేళ తాకితే... భారీ విస్పోటనం జరిగి, పెద్ద గుంతలు ఏర్పడటం వంటివి జరుగుతాయని విన్నాం. అయితే, ఉల్క కారణంగా ఓ మనిషి ప్రాణం పోయినట్టు ఇంతవరకూ చరిత్రలో లేకపోగా, చెన్నైకి చెందిన ఓ ట్రక్ డ్రైవర్ ఇదే కారణంతో మరణించాడు. ఈ విషయాన్ని జయలలిత సర్కారు ఓ ప్రకటనలో తెలిపింది. వేలూరు సమీపంలోని మిస్టరీ పేలుడు, ఆపై వ్యక్తి మరణానికి కారణం ఉల్క పడటమేనని ప్రభుత్వం వెల్లడించింది. ఈ దురదృష్టకర ఘటనలో మరో ముగ్గురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మృతుడి కుటుంబానికి రూ. లక్ష, గాయపడిన వారికి రూ. 25 వేలు పరిహారం ప్రకటించామని జయలలిత తెలిపారు. కాగా, తొలుత బాంబు పేలినట్టు భావించిన అధికారులు, ఆపై ఘటనా స్థలిలో ఎటువంటి పేలుడు పదార్థాలకు చెందిన ఆనవాళ్లు లభించలేదని, ఓ ఉల్క ముక్కను కనుగొన్నామని తెలిపారు. కాగా, ఇంటర్నేషనల్ కామెట్ క్వార్టర్లీలోని సమాచారం మేరకు ఉల్కలు మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా పడుతుంటాయి. ఆపై కొన్ని మార్లు ఇళ్లపై పడ్డప్పటికీ, ప్రాణాలు పోయిన దాఖలాలు లేవు. 2013లో రష్యాలో ఓ భారీ ఉల్క భూమిపై పడడంతో వందలాది భవనాలకు బీటలు వారి ఎంతో మంది గాయపడ్డప్పటికీ, ఎవరూ మరణించలేదు.

  • Loading...

More Telugu News