: రాజమండ్రిలో దాసరి... హోటల్ చుట్టూ పోలీసుల వలయం!
కిర్లంపూడిలో ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని కలిసేందుకు రాజమండ్రి చేరుకున్న దర్శకరత్న దాసరి నారాయణరావు ఓ హోటల్ లో బస చేయగా, హోటల్ చుట్టూ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. కిర్లంపూడికి దాసరి చేరుకుంటే, కొంత ఉద్రిక్తత తలెత్తవచ్చని పోలీసులు భావిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దాసరి హోటల్ బయటకు వస్తే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో కిర్లంపూడికి వెళ్లే మార్గంలో తమను అడ్డుకోవద్దని దాసరి తదితరులు ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాసరి నారాయణరావును అరెస్ట్ చేయాలని గానీ, కిర్లంపూడికి వెళ్లనివ్వాలని గానీ పోలీసు వర్గాలకు ఎటువంటి స్పష్టమైన ఆదేశాలూ లేకపోవడంతో వారు అయోమయంలో ఉన్నారు. ఇదిలావుండగా, తనను కలిసేందుకు డాక్టర్లకు సైతం అవకాశమివ్వని ముద్రగడ, తలుపులు బిగించుకుని దీక్ష కొనసాగిస్తున్నారు.