: కెప్టెన్ కూల్ పై ‘ఫిక్సింగ్’ ఆరోపణలు!...2014 మాంచెస్టర్ టెస్టు ఫిక్సయ్యింది: నాటి జట్టు మేనేజర్


భారత క్రికెట్ అభిమానులే కాక యావత్తు ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ ను ఈ వార్త కలవరానికి గురి చేసేదే. ఆటలో తనదైన శైలిలో సత్తా చాటుతూనే కూల్ గా జట్టును విజయతీరాలకు చేరుస్తున్న కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీపై తొలిసారిగా ఫిక్సింగ్ ఆరోపణలు వినిపించాయి. 2014లో ఇంగ్లండ్ లో పర్యటించిన సందర్భంగా ఆ దేశ జట్టుతో మాంచెస్టర్ లో జరిగిన టెస్టు ఫిక్స్ అయ్యిందని నాటి టీమిండియా జట్టు మేనేజర్, ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కార్యదర్శి సునీల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ దినపత్రిక ‘సన్ స్టార్’ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా అనిల్ దేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన ఆ మ్యాచ్ లో ప్రస్తుత టీమిండియా వన్డే కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీనే కెప్టెన్ గా వ్యవహరించాడు. ‘‘వర్షం కారణంగా పిచ్ పరిస్థితి దృష్ట్యా టాస్ గెలిస్తే తొలుత బౌలింగ్ ఎంచుకోవాలని జట్టు సమావేశంలో నిర్ణయించాం. కానీ ధోనీ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో నేను ఆశ్చర్యానికి గురయ్యా. ధోనీ నిర్ణయాన్ని చూసి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ కూడా షాకయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లా. నాటి బోర్డు చీఫ్ ఎన్.శ్రీనివాసన్ కు లేఖ రాశా. అయితే దీనిపై ఇప్పటికీ బోర్డు స్పందించలేదు’’ అని దేవ్ పేర్కొన్నాడు. దేవ్ వ్యాఖ్యలున్న ఈ వీడియోను సదరు హిందీ డైలీ నిన్న ఢిల్లీలోని భారత ప్రెస్ క్లబ్ లో ప్రదర్శించింది.

  • Loading...

More Telugu News