: ఇప్పుడున్న పట్టాలపైనే హై స్పీడ్ రైళ్లు... ఢిల్లీ, ముంబై రూట్ కు ఫస్ట్ ఛాన్స్!
గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైళ్లు అతి త్వరలో ఢిల్లీ, ముంబై రూట్ లో పరుగులు పెట్టనున్నాయి. స్పెయిన్ సంస్థ టాల్గో తయారు చేసే ఇంజన్, బోగీలు ఈ రూట్ లో ట్రయల్ రన్ కి రెడీ అవుతున్నాయి. ఆపై సంస్థ ఇచ్చే నివేదికను బట్టి ఈ మార్గంలో హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ టెస్ట్ రన్ ను ఉచితంగానే చేసేందుకు టాల్గో ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై నగరాల మధ్య రైలు ప్రయాణం 17 గంటలు పడుతుండగా, ఈ కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం 12 గంటలకు తగ్గుతుందని వివరించారు. ఇండియాకు టాల్గో ఇంజన్, బోగీలను దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలని రైల్వే బోర్డుకు లేఖ రాశామని వివరించారు. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు 30 శాతం వరకూ విద్యుత్తును కూడా ఆదా చేస్తాయని తెలిపారు. టెస్ట్ రన్ విజయవంతమైతే, మరిన్ని రూట్లలో ఇదే విధమైన పరీక్షలు జరిపిస్తామని పేర్కొన్నారు.