: పవన్ కల్యాణ్ పై రాంగోపాల్ వర్మ సెటైర్లు... ఆయన వ్యాఖ్యలన్నీ చెప్పుడు మాటలేనని ఆరోపణ
టాలీవుడ్ అగ్ర నటుడు, జన సేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సెటైర్లు సంధించారు. కాపులకు రిజర్వేషన్ల విషయమై స్పందించడానికి ఇటీవల పవన్ కల్యాణ్ మీడియా ముందుకు వచ్చిన సంగతి విదితమే. ఈ సందర్భంగా పవన్ చేసిన ప్రసంగంపై తాజాగా వర్మ తనదైన శైలిలో స్పందించారు. అసలు మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు ఆయనకైనా అర్థమయ్యాయా? అంటూ వర్మ ప్రశ్నించారు. ప్రెస్ మీట్ కు వచ్చేటప్పుడు తన పక్కనున్న వ్యక్తి చెప్పిన మాటలనే పవన్ కల్యాణ్ వల్లె వేశారని వ్యాఖ్యానించారు. అయినా జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా చేసిన ప్రసంగాన్ని పవన్ మరోమారు చూసుకోవాలని వర్మ సూచించారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి ఆ తర్వాత విఫలమైన దానికంటే, ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఘోరంగా విఫలమయ్యారని కూడా ఆయన ఆరోపించారు. పవన్ కల్యాణ్ అభిమానిగా తాను వ్యక్తపరచిన నిజాలను వ్యతిరేకించే వారెవరైనా తన దృష్టిలో నమ్మక ద్రోహులేనని కూడా వర్మ తేల్చేశారు.