: ముద్రగడ వద్దకు... సర్కారీ ప్రతినిధులుగా కళా, అచ్చెన్న
కాపులకు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీసమేతంగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటికి నాలుగో రోజుకు చేరింది. దీంతో ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తల నేపథ్యంలో నిన్న సాయంత్రమే ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ముద్రగడతో కాస్తంత సన్నిహిత సంబంధాలున్న రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావులను ప్రభుత్వం రంగంలోకి దించింది. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన సొంతింటిలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ వద్దకు వారిద్దరూ చేరుకున్నారు. కాపులకు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు ముద్రగడకు వివరించారు. తాజాగా నేటి ఉదయం ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావులు ముద్రగడతో చర్చలు జరపనున్నారు. ఈ చర్చల తర్వాత ముద్రగడ దీక్ష విరమించనున్నట్లు సమాచారం.