: పట్టాలెక్కిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్... 17 బోగీలతో విజయవాడ నుంచి విశాఖకు పయనం
కాపు ఐక్యగర్జన హింసలో కాలి బూడిదైన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ వారం తర్వాత మళ్లీ పట్టాలెక్కింది. గత నెల 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు ఐక్య గర్జనకు హాజరైన కాపులు రైలు పట్టాలపై పరుగులు పెడుతున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ పై దాడికి దిగారు. రైలు బోగీలకు నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో రైలు మొత్తం కాలి బూడిదైంది. దీంతో విజయవాడ- విశాఖపట్నం మధ్య తిరుగుతున్న ఈ రైలు దాదాపుగా వారం పాటు రద్దయింది. బోగీలు దొరకని కారణంగా రత్నాచల్ ను కొన్నిరోజుల పాటు నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా 17 బోగీలతో సరికొత్తగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను రైల్వే అధికారులు పునరుద్ధరించారు. కొద్దిసేపటి క్రితం ఈ రైలు విజయవాడ నుంచి విశాఖకు బయలుదేరింది.