: మెత్తబడ్డ ముద్రగడ... నేడు ప్రభుత్వ ప్రతినిధులతో చర్చల తర్వాత దీక్ష విరమణ?
కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ గడచిన నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు మెత్తబడ్డారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రభుత్వం తరఫున రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావులు.. ముద్రగడతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నిన్న విశాఖలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, నేతలతో సీఎం నారా చంద్రబాబునాయుడు జరిపిన చర్చల సారాంశాన్ని వారు ముద్రగడకు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు చంద్రబాబు చిత్తశుద్ధితో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తోట, బొడ్డులతో చర్చల తర్వాత కాస్తంత మెత్తబడ్డ ముద్రగడ దీక్ష విరమణకు దాదాపుగా అంగీకరించారు. అయితే నేటి ఉదయం మరోమారు ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాత తన తుది నిర్ణయం వెల్లడిస్తానని ముద్రగడ వారిద్దరికీ తెలిపినట్లు సమాచారం.