: విశాఖ అంటే నాకెంతో ఇష్టం: ప్రధాని మోదీ
విశాఖపట్టణం అంటే తనకెంతో ఇష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శనను వీక్షించేందుకు మోదీ వచ్చిన సంగతి విదితమే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫ్లీట్ రివ్యూను అద్భుతంగా నిర్వహించిన సీఎంకు, నౌకాదళానికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి తరలివచ్చారని అన్నారు. గతంలో హుద్ హుద్ తుపాన్ సంభవించినప్పుడు తాను ఇక్కడికి వచ్చానని, ఈ విపత్తు నుంచి ఇక్కడి ప్రజలు ధైర్యంగానే తేరుకున్నారని అన్నారు. తీర ప్రాంత దేశాలతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మారిటైమ్ ఉపయోగపడుతుందని, సముద్రాల ద్వారానే 90 శాతం వాణిజ్యం కొనసాగుతోందని, సముద్రాల ద్వారా 20 ట్రిలియన్ల విలువైన వాణిజ్యం జరుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. సునామీ, తుపాన్ వంటి ప్రకృతి విపత్తులు అప్పుడప్పుడు సవాళ్లు విసురుతున్నాయని, అన్ని దేశాల నౌకాదళాలు సమష్టిగా భద్రతపై దృష్టి సారించాలని, భారత్ కు 7,500 చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, భారత సముద్రతీర విధానాన్ని మారిషస్ లో ప్రకటించామని ప్రధాని అన్నారు. ఐఎఫ్ఆర్ స్ఫూర్తితో ఏప్రిల్ లో గ్లోబల్ మారిటైమ్ సమ్మేళనం నిర్వహిస్తామని, సింధునాగరికత నాటి నుంచే ప్రపంచదేశాలతో భారత్ కు సత్సంబంధాలున్నాయన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. కాగా, విశాఖ సాగరతీరంలో నిర్వహించిన అంతర్జాతీయ నగర కవాతులో పలు దేశాల నౌకాదళాలు, బ్యాండ్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.