: వ్యూహం మార్చిన చంద్రబాబు సర్కారు... ముద్రగడ ఇంటి వద్ద సగం బలగాల ఉపసంహరణ
కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన అనుమతి లేకుండా తన ఇంటిలోకి పోలీసులు ప్రవేశించారని ఆగ్రహం వ్యక్తం చేసిన ముద్రగడ తన గదిలోకి వెళ్లి స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. దీంతో షాక్ తిన్న చంద్రబాబు ప్రభుత్వం ఒక్కసారిగా వ్యూహం మార్చింది. కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి నారాయణ కొద్దిసేపటి క్రితం సుదీర్ఘ వివరణతో కూడిన విన్నపాన్ని ముద్రగడ ముందుంచారు. అదే సమయంలో ముద్రగడ ఇంటి వద్ద భారీ ఎత్తున మోహరించిన బలగాల్లో సగం మంది పోలీసులను ప్రభుత్వం అక్కడి నుంచి ఉపసంహరించింది. ఇక అక్కడ ఉన్న బలగాలు కూడా కేవలం తనిఖీలకు మాత్రమే పరిమితమయ్యాయి.