: ఇక జల జగడం... గిరిజాపూర్ వద్ద ఏపీ కడుతున్న ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం


మొన్నటిదాకా ఎగువ ప్రాంతాల్లోని కర్ణాటక, మహారాష్ట్రలు... కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులపై కడుతున్న ప్రాజెక్టులపై ఉమ్మడి ఏపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసేది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ఆ అవసరం దాదాపుగా లేకపోయింది. ఎగువ ప్రాంతాల్లో కడుతున్న ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం లేవు. అయితే తాజాగా నాటి జల జగడాల తరహాలో ఏపీ, తెలంగాణల మధ్య ఇప్పుడు తగవులు నెలకొన్నాయి. తుంగభద్రపై రాజోలిబండ వద్ద నిర్మించిన రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) ప్రాజెక్టుపై రాష్ట్ర విభజనకు ముందు నుంచి కూడా ఏపీలోని కర్నూలు, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన రైతుల మధ్య ఘర్షణలు జరిగేవి. తాజాగా దిగువ ప్రాంతంలో ఉన్న కర్నూలుకు నీటిని విడుదల చేసే విషయంలో తెలంగాణ జాప్యం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా కేసీ ఆయకట్టు కింద కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ఈ నష్టాన్ని నివారించుకునేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా ఆర్డీఎస్ కు ఎగువన కర్ణాటకలోని రాయచూర్ జిల్లా గిరిజాపూర్ వద్ద ఓ ప్రాజెక్టును నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. దీనిపై సమాచారం అందుకున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కారు చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నేరుగా కేంద్ర జల సంఘాన్ని ఆశ్రయించిన తెలంగాణ సర్కారు, ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. గిరిజాపూర్ వద్ద ప్రాజెక్టు కడితే, రాజోలిబండకు చుక్క నీరు కూడా అందదని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాక, గిరిజాపూర్ ప్రాజెక్టుపై తక్షణమే అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News