: తనను హత్య చేయమని పురమాయించిన భర్తకు షాక్ ఇచ్చిన భార్య!


రాంగోపాల్ వర్మ తీసిన 'మనీ' సినిమా గుర్తుందా?...అచ్చం ఆ సినిమా కథను పోలిన సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...పదేళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ కు చెందిన బలెంగా కలాలా, బురుండీకి చెందిన నొయిలా రుకుండును వివాహం చేసుకున్నాడు. పదేళ్ల పాటు కొనసాగిన వారి దాంపత్యంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల నొయిలా తల్లి మృతి చెందింది. దీంతో ఆమె బురుండీ వెళ్లింది. దీనిని అవకాశంగా తీసుకున్న కలాలా ఆమెను హత్య చేసేందుకు ఓ వ్యక్తిని నియమించి, అతనికి 7 వేల డాలర్లు చెల్లించాడు. బురుండీ వెళ్లిన నోయిలా ఓ హోటల్ లో దిగి, తల్లి దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమైంది. హోటల్ బయటకు వచ్చిన ఆమెను ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడు. దీంతో షాక్ కు గురైన ఆమె తనను ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో వివరణ అడిగింది. కిడ్నాపర్ చెప్పిన సమాధానం విని ఆమె షాక్ కు గురైంది. దీంతో, తన భర్త చెల్లించిన దానికంటే ఎక్కువ చెల్లిస్తానంటూ కిడ్నాపర్ తో ఒప్పందం చేసుకుంది. అయితే తనను హత్య చేసినట్టు తన భర్తకు సమాచారం చేరవేయాలని సూచించింది. దీంతో కిడ్నాపర్ అలాగే చేశాడు. అనంతరం తల్లి అంత్యక్రియలు పూర్తి చేసుకుని, ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో తన నివాసానికి చేరుకుంది. అప్పటికే కలాలా తన భార్య బురుండీలో రోడ్ యాక్సిడెంట్ లో మృత్యువాతపడిందని టాంటాం చేశాడు. అంతే కాదు, ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించాడు. అయితే, ఒక్కసారిగా భార్యను చూసిన కలాలా కంగుతిన్నాడు. హత్యకు పథకం రచించింది తాను కాదని బుకాయించిన కలాలా, తరువాత నేరం తనదేనని అంగీకరించాడు. దీంతో నొయిలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు అతనికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది.

  • Loading...

More Telugu News