: అందాల రకుల్... కూరగాయలు అమ్మిన వేళ!
హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ మార్కెట్ చాలా బిజీగా ఉంది. ముఖ్యంగా అక్కడి కూరగాయల మార్కెట్ కు జనం తండోపతండాలుగా వచ్చారు. ఒకరినొకరు నెట్టుకుంటూ ముందుకెళుతున్నారు. అక్కడ మెడలో ఎర్రటి టవల్ వేసుకున్న ఓ అమ్మాయి ఏం కావాలని అడుగుతోంది. కానీ అక్కడున్నవారంతా కూరగాయలు కొనడం కంటే వాటిని అమ్ముతున్న ఆమెనే తెగ చూసేస్తున్నారు. అదేంటీ, వచ్చిన పని చూసుకోకుండా కూరగాయలమ్మే వ్యక్తినెందుకు చూస్తున్నారు? అనే సందేహం వస్తుంది కదా. మరి అక్కడ కూరగాయలు అమ్ముతున్నది మామూలు అమ్మాయి కాదు .. అందాల సినీతార రకుల్ ప్రీత్ సింగ్! సినీ నటి, టీవీ వ్యాఖ్యతగా అలరిస్తున్న మంచు లక్ష్మీ 'మేము సైతం' పేరుతో ఓ టీవీ షోను హోస్ట్ చేయనుంది. సామాజిక సేవ నేపథ్యంతో రూపొందుతున్న ఈ కార్యక్రమం కోసమే రకుల్ ఇలా ఆ మార్కెట్లో కూరగాయలు అమ్మింది. ఈ సందర్భంగా అమ్మడు అమ్మిన కూరగాయల ద్వారా వచ్చిన డబ్బును ఏదైనా సామాజిక సేవా కార్యక్రమం కోసం ఉపయోగిస్తారట.