: ఇటుకల దాడికి రాళ్లతో బదులిస్తాం!... ‘పఠాన్ కోట్’ సూత్రధారికి గుణపాఠం తప్పదన్న పారికర్
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిపై భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాడికి పథక రచన చేసిన మాస్టర్ మైండ్ (సూత్రధారి)కి గుణపాఠం చెప్పే తీరతామని ఆయన తేల్చిచెప్పారు. ప్రముఖ హిందీ న్యూస్ ఛానెల్ ‘ఇండియా టీవీ’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నిన్న పారికర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటుకలతో దాడులకు దిగిన ఉగ్రవాదులకు రాళ్లతో బదులిస్తామని పారికర్ అన్నారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడితో భారత సహనం నశించిందని ఆయన పేర్కొన్నారు. ఈ దాడికి పథక రచన చేసిన వారికి తప్పనిసరిగా గుణపాఠం చెబుతామన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ పేరును ప్రస్తావించని పారికర్, ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ప్రతిదాడులు చేసేందుకు కూడా సమయం ఆసన్నమైందని కూడా ఆయన పేర్కొన్నారు.