: గ్రేటర్ మేయర్ ఎవరు?... రేసులో కేకే తనయ, బొంతు రామ్మోహన్


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)పై టీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసింది. మొత్తం 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను కైవసం చేసుకున్న ఆ పార్టీ... ఏ ఒక్కరి మద్దతు అవసరం లేకుండానే గ్రేటర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. నిన్న వెలువడ్డ ఫలితాల్లో అన్ని పార్టీలకు షాకిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటారు. ఇక ఈ నెల 11న గ్రేటర్ మేయర్ పీఠంపై టీఆర్ఎస్ అభ్యర్థి ఆసీనులు కానున్నారు. ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా ఎవరినీ టీఆర్ఎస్ ప్రకటించలేదు. తాజాగా పూర్తి మెజారిటీ సాధించిన ఆ పార్టీ గ్రేటర్ పాలకవర్గం బాధ్యతల్లో పూర్తి కాలం పాటు కొనసాగనుంది. ఈ క్రమంలో మేయర్ పీఠాన్ని అధిరోహించే అభ్యర్థి ఎవరన్న చర్చకు తెర లేచింది. పార్టీ టికెట్ పై విజయం సాధించిన పలువురు అభ్యర్థులు గ్రేటర్ పీఠం తమదేనని ఆశల పల్లకీలో ఊరేగుతున్నా... పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయమే కీలకం కానుంది. అంతేకాక ఈ విషయంలో కేటీఆర్ సూచించిన అభ్యర్థికే కేసీఆర్ మేయర్ పీఠం బాధ్యతలు అప్పగించడం ఖాయం. ఈ క్రమంలో మేయర్ పీఠాన్ని అధిరోహించాలని ఉవ్విళ్లూరుతున్న అభ్యర్థుల జాబితా చాంతాడంత ఉన్నా, పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు కూతురు విజయలక్ష్మి, చర్లపల్లి డివిజన్ నుంచి విజయం సాధించిన బొంతు రామ్మోహన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్ఠానం నుంచి హామీ తీసుకున్న మీదటే బొంతు రామ్మోహన్ బరిలోకి దిగినట్లు ప్రచారం సాగుతోంది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగే రామ్మోహన్ కు మేయర్ పీఠం దక్కడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఇక పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న కె.కేశవరావు... తన కూతురు విజయలక్ష్మికి మేయర్ పీఠాన్ని ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారని వినికిడి.

  • Loading...

More Telugu News