: అందమైన విశాఖకు రండి...మన సామర్థ్యమేంటో వీక్షించండి!: ఆర్కే ధోవన్
'సిటీ ఆఫ్ డెస్టినీ'కి వచ్చి మన దేశ నావికాదళ శక్తి సామర్థ్యాలు వీక్షించాలని నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్కే ధోవన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ నేవల్ ఫ్లీట్ నిర్వహణ సందర్భంగా ఆయన విశాఖపట్టణంలో మాట్లాడుతూ, హుదూద్ చేసిన గాయం నుంచి అద్భుతమైన రీతిలో కోలుకోవడం విశాఖపట్టణ ప్రజల స్పూర్తిని తెలియజేస్తుందని అన్నారు. విశాఖపట్టణం దేశంలోనే సుందరమైన పట్టణమని పేర్కొన్నారు. అందుకే ఈ పట్టణానికి సిటీ ఆఫ్ డెస్టినీ అని పేరు వచ్చిందని ఆయన చెప్పారు. నేవల్ ఫ్లీట్ నిర్వహణకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలని ఆయన చెప్పారు. భౌగోళికంగా మనం వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నప్పటికీ, సముద్రం సమీపం నుంచి చూస్తే ప్రపంచం మొత్తం కలిసే ఉందనే భావన కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ జలాల్లో సముద్ర దొంగలను అడ్డుకోవడం కష్టమని చెప్పిన ఆయన, భారత నావికాదళం వాటికి చెక్ చెప్పిందని అన్నారు. వివిధ దేశాలతో సముద్ర జలాలపై ఉన్న వివాదాలను భారత నావికదళం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. హిందూ మహాసముద్రంలో, చైనా సముద్రంలో వివాదాస్పద ప్రాంతాల్లో భారత్ నిఘా సమర్థవంతమైనదని ఆయన తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే సబ్ మెరీన్ లు నావికాదళానికి అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో స్వదేశీపరిజ్ఞానంతో రూపొందిన నౌకలు, సబ్ మెరీన్లు విధులు నిర్వర్తిస్తున్నాయని ఆయన తెలిపారు. మన శక్తిసామర్థ్యాలు అపారమైనవని ఆయన చెప్పారు.