: బొత్స! కాపులకు ఏం చేశావ్?: డిప్యూటీ సీఎం
అధికారంలో ఉన్న పదేళ్లు మంత్రి వర్గంలో ఉన్న బొత్స సత్యనారాయణ కాపు సామాజిక వర్గానికి ఏం చేశారో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, జగన్ వ్యూహాల అమలులో భాగంగా కాపు నేతలు ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో కాపులకు న్యాయం చేయాలని భావిస్తున్న తరుణంలో లేనిపోని ఆరోపణలతో ఇబ్బంది పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ముద్రగడ పద్మనాభంకు కాపులకు న్యాయం చేయడం కావాలో, లేక, సామాజిక వర్గం ముసుగులో వ్యక్తిగత పేరు ప్రతిష్ఠలు కావాలో తేల్చుకోవాలని ఆయన సూచించారు. ముద్రగడ చర్యలతో కాపుల పట్ల సమాజంలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చట్టబద్ధంగా న్యాయం చేస్తామని చెబుతున్నప్పటికీ గొంతెమ్మ కోరికలు కోరడం సరికాదని ఆయన ముద్రగడకు హితవు పలికారు. ఓ కమిటీని వేస్తే, ఆ నివేదిక వచ్చే వరకు ఆగాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అలా కాకుండా మధ్యలోనే నివేదిక అడిగితే దానికి సహేతుకత ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలకు మద్దతు పలకాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.