: ముద్రగడను కలసి పరామర్శించిన వీహెచ్
కాపుల రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష చేపట్టిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు కలసి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అంశాన్ని ఆలస్యం చేయకుండా త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడను కలిసేందుకు వచ్చిన వీహెచ్ ను నివాసం లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన వీహెచ్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలపడంతో పోలీసులు ఆయనను లోనికి పంపించారు.