: నాపై దాడి జరుగుతుంటే... బెంగళూరు పోలీసులు పారిపోయారు: టాంజానియా విద్యార్థిని
బెంగళూరులో విద్యనభ్యసిస్తున్న టాంజానియా విద్యార్థినిపై జరిగిన దాడి బెంగళూరు పోలీసుల మెడకు చుట్టుకుంది. గత ఆదివారం రాత్రి ఓ విదేశీయుడి కారు ఢీకొని బెంగళూరులో ఓ మహిళ చనిపోయింది. అదే సమయంలో అటుగా వచ్చిన టాంజానియా విద్యార్థిపై బెంగళూరు వాసులు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆ యువతిని చితకబాదిన కన్నడిగులు, ఆమెను వివస్త్రను చేసి నడిరోడ్డుపై పరుగులు తీయించారు. ఈ వ్యవహారంపై టాంజానియా ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. కాపాడమంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా, అక్కడి పోలీసులు కూడా స్పందించలేదన్న వార్తలతో ఈ వివాదం మరింత ముదిరింది. తాజాగా తనపై జరిగిన దాడిని గుర్తుకు తెచ్చుకున్న బాధితురాలు మరో కీలక వ్యాఖ్య చేసింది. తనపై దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు చూస్తుండిపోయారని ఆరోపించింది. అంతేకాక అక్కడి నుంచి మాయమయ్యేందుకు పోలీసులు పరుగు లంకించుకున్నారని కూడా ఆ యువతి పేర్కొంది. దీంతో బెంగళూరు పోలీసులు కఠిన చర్యలను ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది.