: సెల్ఫీ తీసుకోవడమే కాకుండా తిక్క సమాధానం చెప్పాడు...జైలు పాలయ్యాడు!
మహిళా కలెక్టర్ కు అతి సమీపంగా వెళ్లి సెల్ఫీ తీసుకోవడమే కాకుండా..‘ఫొటో డిలీట్ చెయి’ అని చెప్పిన ఆమెకు తలతిక్క సమాధానం చెప్పిన ఒక యువకుడు కటకటాల పాలయ్యాడు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ జిల్లా కలెక్టర్ చంద్రకళ ఇటీవల తన కార్యాలయానికి వచ్చిన కమల్ పూర్ గ్రామస్తుల సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తోంది. అప్పటికే అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. ఉన్నట్టుండి, అహ్మద్ అనే పద్దెనిమిది సంవత్సరాల యువకుడు ఆమెకు దగ్గరగా వెళ్లి, తన మొబైల్ ఫోన్ తో సెల్ఫీ తీసుకున్నాడు. ఇదంతా గమనిస్తున్న కలెక్టర్ కొంచెం ఇబ్బంది పడింది. ‘ఆ ఫొటోను డిలీట్ చెయి’ అని మర్యాదపూర్వకంగా ఆమె చెప్పింది. అయితే, ఆమె మాటలను ఆ యువకుడు పట్టించుకోకపోగా.. ‘నా ఫోన్.. నా ఇష్టం.. ఎందుకు డిలీట్ చేయాలి?’ అంటూ ఎదురు ప్రశ్నలు వేశాడు. దీంతో, ఆగ్రహించిన కలెక్టర్ 'ఆ యువకుడిని అరెస్ట్ చేయండి' అంటూ అక్కడ ఉన్న పోలీసు అధికారులను ఆదేశించింది. వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టు ఆదేశాల ప్రకారం జైలుకు పంపారు. కాగా, చంద్రకళకి సమర్థవంతురాలైన అధికారిణిగా పేరుంది. జటిలమైన సమస్యలను సైతం ప్రజల సహకారంతో ఆమె పరిష్కరించారు. నిత్యం వందల సంఖ్యలో ప్రజలు ఆమె కార్యాలయానికి వెళ్లి సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు.