: కాంగ్రెస్ కు పునర్ వైభవంపై రాహుల్ దృష్టి... పీసీసీ చీఫ్ లతో ప్రత్యేక భేటీ
పదేళ్ల అధికారం తర్వాత మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఏపీ విభజనతో మంచి పట్టున్న తెలుగు నేలలో ఆ పార్టీ పరిస్థితి అధోగతికి చేరుకుంది. సమీప భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ తిరిగి కోలుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇక దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా ఏమీ లేదు. ఈ నేపథ్యంలో పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చే దారే లేదా? అన్న అంశంపై ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆయన నేటి ఉదయం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల పార్టీల శాఖల(పీసీసీ) చీఫ్ లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి రఘువీరారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఏ కార్యక్రమాల ద్వారా పార్టీకి పునర్వైభవం వస్తుందని రాహుల్ గాంధీ పీసీసీ చీఫ్ లను ఆరా తీసినట్లు సమాచారం. సమావేశం ఇంకా కొనసాగుతోంది. నేటి సాయంత్రం దాకా కొనసాగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదన్న వాదనా వినిపిస్తోంది.