: ఒకటే కాలేయంతో జన్మించిన అవిభక్త కవలలు!
ఇరవై ఏళ్ల యువతి ఒకటే కాలేయంతో ఉన్న అవిభక్త కవలలకు జన్మనిచ్చిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగింది. అక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్న అవిభక్త ఆడ శిశువులు జన్మించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యుడు సందీప్ గుప్తా, గైనకాలజిస్ట్ డాక్టరు శశి గుప్తా మాట్లాడుతూ, 'కూలిపని చేసుకునే ప్రదీప్, మోహినీ దంపతులకు ఈ అవిభక్త ఆడశిశువులు జన్మించారు. ఈ తరహా శిశువులు లక్ష మందిలో ఒకరికి పుడతారు' అని చెప్పారు. అవిభక్త కవలలను వేరు చేయడమనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని అన్నారు. 34 వారాల్లోగా వారిని వేరు చేయాలని, అలా జరగని పక్షంలో వారు జీవించే అవకాశాలు తగ్గిపోతాయని అన్నారు. ఢిల్లీలోని ఏఐఐఎంఎస్ లేదా గంగారామ్ ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స చేసి వారిని విడగొట్టవచ్చన్నారు. ఈ సందర్భంగా అవిభక్త కవలల తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఒకటే కాలేయంతో కలిసి పుట్టిన వారిద్దరిని జాగ్రత్తగా చూసుకునే ఆర్థిక శక్తి తమ వద్ద లేదని, అయినప్పటికీ వారిని బతికించుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. అయితే, ప్రభుత్వం తమకు సహాయపడాలని కోరుతున్నామన్నారు.