: ప్లేటు చేతబట్టిన ముద్రగడ... గరిటెతో మోత మోగించిన కాపు నేత
కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ నేటి ఉదయం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనదైన శైలిలో దీక్ష కొనసాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన సొంతింటిలోనే సతీసమేతంగా దీక్షకు దిగిన ముద్రగడ, తన దీక్షకు సంఘీభావంగా ఏ ఒక్కరూ కిర్లంపూడి రావద్దని పిలుపునిచ్చారు. కాపులంతా తమ ఇళ్లల్లో నుంచే తన దీక్షకు మద్దతు పలకాలని కోరారు. తన దీక్షకు సంఘీభావంగా మధ్యాహ్న భోజనం మానేసి ప్లేటుపై గరిటెతో కొడుతూ శబ్దం చేయాలని ముద్రగడ పిలుపునిచ్చారు. ప్లేటుపై గరిటెతో కాపులు చేసే శబ్దం విని అయినా సీఎం చంద్రబాబు తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ముద్రగడ దీక్ష ప్రారంభానికి ముందు వ్యాఖ్యానించారు. తాజాగా తన ఇంటిలోనే దీక్షకు కూర్చున్న ఆయన ప్లేటు చేత బట్టి, మరో చేతిలో గరిటెను తీసుకుని ప్లేటును కొడుతూ ఆయన పెద్ద శబ్దం వచ్చేలా వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేపట్టారు.