: ముద్రగడ నివాసం చుట్టూ భారీ భద్రత... ఇంటి గేట్లు మూసివేత
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసం, పరిసర ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన ఇంట్లో భార్యతో కలసి ఆయన ఆమరణ దీక్ష చేపట్టగానే ఇంటి గేట్లు మూసివేశారు. నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాపు నేతలు, సందర్శకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దాంతో పోలీసులకు, ముద్రగడకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అయినప్పటికీ పోలీసులు ససేమిరా అన్నారు. మరోవైపు ముద్రగడ దంపతులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అంతకుముందు దీక్షాస్థలం, పరిసరాలను పరీశీలించిన జిల్లా ఎస్పీ రవిప్రకాశ్, జిల్లా అంతటా 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. దీక్షా శిబిరానికి ఎవరూ రావొద్దని ముద్రగడ చెప్పారని ఎస్పీ తెలిపారు. శాంతియుతంగా నిరసనలు చేయవచ్చని, అల్లర్లకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.