: కేజ్రీజీ... బూట్లు కొనుక్కోండి!: ఢిల్లీ సీఎంకు రూ.364 డీడీ పంపిన విశాఖ వ్యాపారవేత్త
‘ఆప్' కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు విశాఖకు చెందిన సుమిత్ అగర్వాల్ అనే వ్యాపారవేత్త షాకిచ్చారు. ఓ జత బూట్లు కొనుక్కోమంటూ లేఖ రాయడమే కాక, అందుకు అవసరమైన రూ.364 డీడీని కేజ్రీకి పంపారు. ఈ సందర్భంగా అగర్వాల్ తాను కేజ్రీకి రాసిన లేఖను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అసలు కేజ్రీకి అగర్వాల్ లేఖ రాయడంతో పాటు స్వల్ప మొత్తానికి చెందిన డీడీని ఎందుకు పంపారంటే, దాని వెనుక పెద్ద కథే ఉంది. ఆ కథ మొత్తాన్ని అగర్వాల్ తన లేఖలో పేర్కొన్నారు. ‘‘ప్రియమైన కేజ్రీవాల్ గారూ... నేను విశాఖపట్నానికి చెందిన వ్యాపారవేత్తను. ఇక్కడ త్వరలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరగనుంది. 60 దేశాలకు చెందిన ప్రతినిధులు వచ్చే అవకాశముంది. మీకు కూడా ఆహ్వానం అందుతుందేమోనన్న ఆందోళనతో ఈ లేఖ రాస్తున్నా. ఇటీవల గణతంత్ర అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ కు రాష్ట్రపతి విందు ఇచ్చారు. ఆ విందులో మీరూ పాల్గొన్నారు. కానీ మీరు చెప్పులు ధరించి వచ్చి హోలాండ్ ను కలవడం నన్ను కలవరానికి గురి చేసింది. కొన్ని సందర్భాలు, ప్రదేశాల్లో అందుకు అనుగుణంగా వేషధారణ ఉండాలి. నెలకు రూ.2.10 లక్షల వేతనం అందుకుంటున్నా, మీకు బూట్లు లేకపోవడం విచారకరం. అందుకే పాదాలను నిండుగా కప్పి ఉండే బూట్లను కొనుక్కునేందుకు చందాలు పోగేసి మీకు ఈ డబ్బు పంపుతున్నా’’ అని అగర్వాల్ ఆ లేఖలో పేర్కొన్నారు.