: మోదీతో కలిసి.. కాంగ్రెస్ శవాన్ని మోస్తా!: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
సంచలన వ్యాఖ్యలకు మజ్లిస్ నేత, తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ... కేరాఫ్ అడ్రెస్. ఇటీవల ముగిసిన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 30న హైదరాబాదు నగరంలోని బాబా నగర్ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయిపోయింది. తమకు బద్ధ శత్రువుగా భావిస్తున్న బీజేపీతో దోస్తీ కడతామంటూ అక్బరుద్దీన్ ఆ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తరిమికొట్టేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఓవైసీ ప్రకటించారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపైనే కాక, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై సైతం అక్బరుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీని దేశమంతా వెంటాడతా. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి కాంగ్రెస్ ను సర్వనాశనం చేసి... ఆ శవాన్ని మోదీతో కలిసి మోస్తా. ఇందిరా గాంధీ దారుస్సలాం (మజ్లిస్ కార్యాలయం) గడప తొక్కింది. మేమెప్పుడూ గాంధీ భవన్ గడప తొక్కం. కానీ సోనియా, రాహుల్ గాంధీలతో దారుస్సలాం గడప నాకిస్తా’’ అని ఆయన ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు.