: గ్రేటర్ ఓట్ల లెక్కింపు నేడు... మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం, 5 గంటల తర్వాత ఫలితాలు
అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ నెల 2న జరిగిన పోలింగ్ కు సంబంధించి ఓట్ల లెక్కింపు నేటి మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కానుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. షెడ్యూల్ ప్రకారం నేటి ఉదయమే కౌంటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, పురానాపూల్ డివిజన్ లో రీకౌంటింగ్ ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో కౌంటింగ్ ను మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నమే ఓట్ల లెక్కింపు ప్రారంభమైనా, నేటి సాయంత్రం 5 గంటల తర్వాత కాని తొలి ఫలితం విడుదల కాదు. రీపోలింగ్ ముగిసిన తర్వాతే ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు పూర్తి అయిన డివిజన్లలోనూ ఫలితాలు మాత్రం 5 గంటల తర్వాతే వెల్లడి కానున్నాయి.