: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆస్తుల జప్తు!


నిధుల కుంభకోణం విషయంలో ఆరోపణలు, కేసులతో సతమతమవుతున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) కు మరో తలకాయనొప్పి వచ్చిపడింది. ఆదాయపు పన్ను శాఖకు హెచ్సీఏ కోట్లాది రూపాయలు బకాయిపడటంతో అసోసియేషన్ ఆస్తుల జప్తునకు రంగం సిద్ధమైంది. ఇన్ కంటాక్స్ చెల్లించమంటూ పలుమార్లు పంపిన నోటీసులకు హెచ్సీఏ స్పందించకపోవడంతో సంబంధిత అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇన్ కంటాక్స్ శాఖకు హెచ్సీఏ సుమారు రూ. 22.80 కోట్లు బకాయిపడింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్, మహబూబ్ నగర్ పట్టణాల్లో హెచ్సీఏ స్టేడియాల కోసం తీసుకున్న స్థలాలను అటాచ్ చేయాలని ఇన్ కంటాక్స్ అధికారులు నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లా శివారు మండలంలోని గోపన్నపల్లి గ్రామంలో 248, 260 సర్వే నంబర్లలోని ఐదు ఎకరాల 34 గుంటల స్థలాన్ని అటాచ్ చేస్తున్నట్లు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఇన్ కంటాక్స్ రికవరీ అధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అయితే, ఈ ఉత్తర్వులను తీసుకునేందుకు హెచ్సీఏ అధికారులు నిరాకరించడంతో ఆ ఉత్తర్వులను స్టేడియం గోడలకు అతికించడం గమనార్హం.

  • Loading...

More Telugu News