: చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ వివాహం ఖరారు!
మెగాస్టార్ చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజకు వివాహం కుదిరినట్టు తెలుస్తోంది. 2007లో శిరీష్ భరద్వాజ్ అనే యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుని, బిడ్డకు తల్లయిన శ్రీజ, ఆపై విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆపై లండన్ లోని కోవెంట్రీ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ నిమిత్తం వెళ్లిన ఆమెకు 2014లో విడాకులు లభించాయి. ఆపై ఆమెకు మరో పెళ్లి చేయాలని చాలా రోజులుగా చిరు కుటుంబం భావిస్తోంది. ఇప్పుడామె వివాహం చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ కుటుంబంలోని యువకుడితో నిశ్చయం అయిందని సమాచారం. కొద్ది రోజుల క్రితమే వివాహం ఖరారైందని, మార్చిలో వివాహమని 'దక్కన్ క్రానికల్' దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వివాహ చర్చల కోసమే పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్' షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకుని వచ్చారని తెలిపిన పత్రిక, అందరూ కాపు గర్జన, తుని విధ్వంసంపై మాట్లాడేందుకు వచ్చారని భావించారని వెల్లడించడం గమనార్హం.