: కాపులను ఏ కేటగిరిలో చేర్చాలో కమిషన్ నిర్ణయిస్తుంది: మంత్రి యనమల
కాపులను బీసీల్లో చేర్చే అంశంపై జస్టిస్ మంజునాథన్ కమిషన్ 9 నెలల్లో నివేదిక ఇస్తుందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కమిషన్ లోని ఇతర సభ్యుల నియామకం, విధివిధానాలను త్వరలో రూపొందిస్తామని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన చెప్పారు. ఈ క్రమంలో కాపులను ఏ కేటగిరిలో చేర్చాలో కమిషనే నిర్ణయిస్తుందన్నారు. ప్రస్తుతం ఏపీలో బీసీ రిజర్వేషన్ కింద 4 కేటగిరిలలో మొత్తం 140 కులాలున్నాయని, 27 శాతం బీసీ రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని వివరించారు. గతంలో ఈ కేటగిరిలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారని పేర్కొన్నారు. తమిళనాడులో బీసీలు 80 శాతానికిపైగా ఉన్నారని, అందుకే 60 శాతం రిజర్వేషన్ పెంచుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పారు. 9వ షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ లో చట్ట సవరణ జరగాలన్నారు.