: రాజకీయాల్లోకి వస్తున్న దేవెగౌడ పెద్ద కోడలు!
దేశ రాజకీయాల్లో తనదైన హవా చూపిన మాజీ ప్రధాని దేవెగౌడ ఇంటినుంచి మరొకరు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన ఇద్దరు కుమారులు రేవన్న, కుమారస్వామి, చిన్నకోడలు అనితలు రాజకీయాల్లో రాణిస్తున్నారు. తాజాగా గౌడ పెద్ద కోడలు, కుమారుడు రేవన్న సతీమణి అయిన భవానీ రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారని సమాచారం. ఇందుకు మామగారైన దేవెగౌడ ఆమోదముద్ర వేస్తారని, తరువాత అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అంతేగాక ఇప్పటికే స్థానికులు కూడా ఆమె అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తున్న క్రమంలో గౌడ తప్పకుండా ఒప్పుకుంటారని అంటున్నారు. అదే గనుక జరిగితే హసన్ జిల్లా హొళెనరసిఫుర నియోజకవర్గం పరిధిలోని హళేకోట జిల్లా పంచాయతీ స్థానానికి భవానీ పోటీచేయవచ్చు. ఇప్పటికే గౌడ చిన్న కోడలు అనిత గతలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.