: అశ్విన్ పై షోయబ్ అఖ్తర్ ప్రశంసలు... ప్రపంచంలోనే మేటి స్పిన్నర్ గా అభివర్ణన
చెన్నై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ శక్తి సామర్థ్యాలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావిల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరుగాంచిన షోయబ్ అఖ్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎప్పటికప్పుడు తన ప్రతిభను పెంపొందించుకునేందుకు శతథా యత్నిస్తున్న అశ్విన్... ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ అని షోయబ్ కీర్తించాడు. టీమిండియా మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి అశ్విన్ జట్టును గెలుపు తీరాలకు చేరుస్తున్నాడని అతడు చెప్పాడు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించిన అఖ్తర్, టీమిండియా కొత్త కుర్రాడు జస్ ప్రీత్ బుమ్రా అద్భుతమైన రీతిలో అరంగేట్రం చేశాడని చెప్పాడు. మొహ్మద్ షమీ, వరుణ్ ఆరోన్ లాంటి సీమర్లు దూరమవడం భారత్ కు తీరని నష్టమేనని కూడా అతడు పేర్కొన్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీనే అత్యుత్తమమని అఖ్తర్ తేల్చేశాడు.