: ముద్రగడ డెడ్ లైన్ నేటి సాయంత్రమే!...కిర్లంపూడిలో భారీగా మోహరించిన పోలీసులు
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయాలంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం విధించిన డెడ్ లైన్ నేటి సాయంత్రంతో ముగియనుంది. నేటి సాయంత్రంలోగా ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన విడుదల కాకపోతే, రేపటి నుంచి తన భార్యతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ముద్రగడ ప్రభుత్వానికి దాదాపుగా అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో ఏపీలో... ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. మొన్నటి కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. డీజీపీ జేవీ రాముడు నిన్న స్వయంగా రాజమహేంద్రవరం వెళ్లి స్థానిక పోలీసు అధికారులతో మంతనాలు జరిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ప్రకటన రాకుంటే, తూర్పు గోదావరి జిల్లాలోని తన సొంతూరు కిర్లంపూడిలోనే ముద్రగడ దీక్షకు దిగనున్నారు. దీంతో ఆ గ్రామాన్ని ఇప్పటికే పోలీసు బలగాలు చుట్టుముట్టేశాయి. భారీ సంఖ్యలో మోహరించిన బలగాలు చీమ చిటుక్కుమన్నా స్పందించేందుకు సర్వసన్నద్ధమయ్యాయి.